వైసీపీలో యాంకర్ శ్యామలకు కీలక పదవి ..!
యాంకర్ శ్యామలకు వైసీపీ చీఫ్ జగన్ కీలక పదవి కట్టబెట్టారు. ఆమెను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. శ్యామలతో పాటు భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావు, ఆర్కే రోజాను అధికార ప్రతినిధులుగా ప్రకటిస్తూ వైసీపీ ఉత్తర్వులు జారీ చేసింది. అటు మాజీ మంత్రి పెద్దిరెడ్డిని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC) మెంబర్గా నియమించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ బాధ్యతలూ ఆయనకే అప్పగించారు.
ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి, ఆ తర్వాత కీలక నేతలు పార్టీని వీడుతుండడంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించడం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులను కూడా నియమించారు. నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలకూ స్థానచలనం కల్పించారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరఫున శ్యామల ప్రచారం చేసిన విషయం తెలిసిందే. పిఠాపురం వేదికగా జనసేనాని పవన్ కల్యాణ్‌ను విమర్శించిన శ్యామలపై జనసేన, టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేశారు. అప్పటికే ఆమె పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్నప్పటికీ.. పార్టీపరంగా ఎలాంటి హోదా కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఆమెకు పార్టీ అధికార ప్రతినిధిగా హోదా లభించింది.