పసి హృదయాన్ని పదిలంగా చూసుకుందాం

పసి హృదయాన్ని పదిలంగా చూసుకుందాం

పెద్దవారికి గుండె సమస్యలు రావడం అనేది సహజంగా మారింది. అప్పుడే పుట్టిన పసబిడ్డలకు సైతం వస్తున్న గుండె సమస్యలు తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి. గర్భం దాల్చిన సమయం నుంచి ప్రసవించే వరకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, వివిధ కారణాలతో గుండె చిల్లులు పడి జన్మిస్తున్నారు కొందరు. ఈ సమస్యలు ఈ మధ్యకాలంలో అధికమవుతున్నాయి. మారుతున్న జీవనశైలి కారణంగానే జన్యుపర లోపాలతో శిశివులు జన్మిస్తున్నారు. అయితే,  గుండె సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యులు ముందే చెబుతున్నారు. యేటా ఫిబ్రవరి రెండో వారంలో పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల (సీహెచ్ డీ) మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. గుండె లోపాలు అనగానే అదేదో అరుదైన సమస్యగా చాలా మంది భావిస్తుంటారు. నిజానికిది పెద్ద సమస్య.  రోజూ ప్రతి వెయ్యి మంది శిశువులలో  పది మంది శిశువులు గుండె లోపాలతో పుడుతున్నారు.  మన తెలుగు రాష్ట్రాలలో యేటా 20 వేల మంది పిల్లలకు పుట్టుకతోనే గుండె లోపాలు ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో లోపాలను తొలిదశలోనే గుర్తించగలుగుతున్నాం. లోపాలకు వీలైనంత త్వరగా చికిత్స చేయిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. 

సమస్యలకు కారణాలేంటి?
అతి సున్నితమైన గుండె నిర్మాణం సంక్లిష్టమైంది. పిండంలో 21వ రోజుకే గుండె కొట్టుకోవటం, రక్త ప్రసరణ మొదలవుతాయి. 4 వారాలకే గుండె గదులు ఏర్పడతాయి. 12 వారాలకు గుండె పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. ఈ దశలో ఎక్కడ పొరపాట్లు జరిగినా లోపాలకు దారితీస్తాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి గుండెలో రంధ్రాలు. సుమారు 25 శాతం లోపాలు ఇవే. గర్భం ధరించిన తొలినాళ్లలో పోషకాల లోపం, ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 లోపం గర్భస్థ శిశువులో గుండె లోపాలకు దారితీయొచ్చు. తొలి మూడు నెలలలో,  ముఖ్యంగా పిండంలో గుండె ఏర్పడే దశలో రుబెల్లా వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు సైతం లోపాలకు దారితీయొచ్చు. మేనరికం పెళ్లి చేసుకున్నవారికి పుట్టబోయే పిల్లలలో జన్యుపర కారణాలతోనూ గుండె లోపాలు రావచ్చు. వీరికి ఇతర లోపాల ముప్పూ ఎక్కువే.  కొందరికి జన్యు లోపాలతోనూ గుండె నిర్మాణ ప్రక్రియ అస్తవ్యస్తం కావొచ్చు. పురుగుల మందులు, గర్భం ధరించిన తొలివారాలలో పురుగు మందులు, రేడియేషన్, కొన్నిరకాల మందుల ప్రభావానికి గురైనా గుండె లోపాలు తలెత్తొచ్చు. గర్భధారణ సమయంలో పొగ తాగటం, మద్యం తాగటం వంటి అలవాట్లతోనూ సమస్యలు రావచ్చు. 

గుర్తించటమెలా?
సాధారణంగా గుండెలో రంధ్రాలు ఏర్పడినవారిలో  గుండె వైఫల్య లక్షణాలు కనిపిస్తుంటాయి. గుండె గదుల మధ్య రంధ్రాలు ఉన్నప్పుడు చెడు రక్తంతో మంచి రక్తం ఎక్కువగా కలిసిపోతుంటుంది. దీంతో ఊపిరితిత్తులకు మరింత ఎక్కువగా రక్తం చేరుకుంటుంది. ఫలితంగా ఊపిరితిత్తులు తడితడిగా అయిపోతాయి. దీంతో పిల్లలు పాలు సరిగా తాగలేరు. ఆయాసం, తరచూ న్యుమోనియా బారినపడటం వంటివీ వేధిస్తాయి. చెడు రక్తం, మంచి రక్తం కలిసిపోయి, ఒళ్లంతా విస్తరించటం వలన పెదాలు, వేళ్లు, నాలుక వంటిని నీలంగా అవుతాయి. కొందరికి ఉన్నట్టుండి నీలంగా అవటం ఎక్కువ కావొచ్ఛు కనుగుడ్లు తేలేయొచ్చు. కవాటాలు బిగుసుకుపోవటం, లీక్ అయ్యేవారిలో అలసట, నిస్సత్తువ వంటివి కనిపిస్తుంటాయి. పెద్దగా అయ్యాక శారీరక శ్రమను అంతగా తట్టుకోలేరు, ఆటలకు దూరంగా ఉంటుంటారు. తోటివారితో ఆడుకోవటానికి వెనకాడుతుంటారు. 

ఎంత ముందుగా గుర్తించొచ్చు?
గుండె లోపాలను 18 వారాల గర్భం సమయంలోనే గుర్తించొచ్ఛు ఇందుకు ఫీటల్ ఎకో కార్డియోగ్రామ్ పరీక్ష బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా సురక్షితం. ఒంట్లోకి గొట్టాల వంటివి పంపించాల్సిన పనిలేదు. సమస్యలను కచ్చితంగా నిర్ధారించొచ్ఛు. బిడ్డ ఆరోగ్యం ఎలా ఉండగలదు అనేవీ తెలుస్తాయి. దీన్ని బట్టి ముందుగానే శస్త్రచికిత్సలను నిర్ణయించుకోవచ్ఛు కవాటాలు మూసుకుపోయినవారికి కొన్నిసార్లు గర్భంలో ఉండగానే సరిదిద్దే పద్ధతులూ అందుబాటులో ఉన్నాయి.

లోపాలు పోతాయా?
గుండె, ఊపిరితిత్తుల పనితీరు బాగా అర్థం కావటం, అధునాతన పరికరాలు అందుబాటులోకి రావటం, సుశిక్షితులైన సిబ్బంది, శస్త్రచికిత్స అనంతరం సేవల వంటివన్నీ గుండె లోపాలతో సంభవించే మరణాలకు అడ్డుకట్ట వేయటానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అధునాతన చికిత్సలతో చాలావరకు గుండె లోపాలను పూర్తిగా సరిదిద్దొచ్చు. గుండె రంధ్రాలను ముందుగానే గుర్తించగలిగితే తగు మందులు ఇవ్వటం, ఆహార పరంగా జాగ్రత్తలు పాటించటం ద్వారా దుష్ప్రభావాలు ముంచుకురాకుండా చూసుకోవచ్చు. ఇందుకోసం మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. సుమారు 60 శాతం రంధ్రాలు వాటంతటవే మూసుకుపోతాయి. వీటికి శస్త్రచికిత్సలు అవసరం లేదు. గుండె లోపాలతో పుట్టిన వారిలో సుమారు 20 శాతం మందికి పుట్టిన నెల లోపే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. మిగతావారిలో చాలామందికి బడికి వెళ్లే వయసులో శస్త్రచికిత్స చేయాల్సి రావొచ్చు. భయపడాల్సిన పనేమీ లేదు.