ఇక నుంచి సాగు భూములకే రైతు భరోసా... దసరా పండుగ నుంచి ప్రారంభం

ఇక నుంచి సాగు భూములకే రైతు భరోసా... దసరా పండుగ నుంచి ప్రారంభం
  • క్షేత్రస్థాయి నుంచి అందిన నివేదికలు
  • ఇప్పటి వరకు 1.31 కోట్ల ఎకరాల్లో పంట
  • ఎకరాకు రూ. 7,500 చొప్పున భరోసా సాయం
  • రూ. 10 వేల కోట్ల సర్దుబాటుకు సన్నాహాలు
  • వచ్చేనెల మొదటి వారంలో మార్గదర్శకాలు
ముద్ర, తెలంగాణ బ్యూరో :- రాష్ట్ర ప్రభుత్వం మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అర్హులైన రైతులందరికి రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు దాదాపుగా రంగం సిద్ధమైంది.  దసరా పండుగ నుంచి రైతులకు ఈ పథకం నిఅధు నిధులను ప్రభుత్వం పంపిణి చేయనుంది. ఈ మేరకు శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే రైతు భరోసాను సాగు భూములకు మాత్రమే అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే క్షేత్ర స్థాయి నుంచి పూర్తి స్థాయిలో నివేదికలను తెప్పించుకుంది. గత ప్రభుత్వం హయంలో సాగు చేయని భూములకు,  కొండలు, గుట్టలు ఉన్న భూములకు సైతం  ఆర్ధిక సాయం అందజేసింది. దీనిపై పెద్దఎత్తున విమర్శలు తలెత్తడంతో రేవంత్ సర్కార్ ఆచూతూచి నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే కేవలం సాగు భూములకు మాత్రమే రైతు భరోసాను అందించాలని తలపెట్టింది. దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందించి అక్టోబర్ తొలి వారంలో  మార్గదర్శకాలను వెల్లడించనుంది.
వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఈ వానాకాలం సీజన్లో 1.31 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా వరి  సుమారు 70 లక్షల ఎకరాల్లో  సాగు జరిగినట్లుగా అధికారులు తేల్చారు. అలాగే పప్పు ధాన్యాల పంటలు సుమారు 5.82 లక్షల ఎకరాలు, ఆయిల్ పంటలు  4.25 లక్షల ఎకరాలు, పత్తి 43.48 లక్షల ఎకరాల్లో సాగు అయినట్లుగా అధికారులు  లెక్కించారు. కాగా సాకైన ఆ మొత్తం భూములకు ఎకరాకు రూ.7,500 చొప్పున రైతు భరోసా డబ్బులు ఇస్తే దాదాపు రూ.10 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఈ మేరకు అవసరమైన నిధులు సిద్ధం చేయాలని ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌ను ఇప్పటికే  సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఇస్తామన్న రూ.2 లక్షల రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం మెుత్తం మూడు విడతల్లో పూర్తి చేసింది. దాదాపు రూ.31 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. అయితే సాంకేతిక సమస్యల కారణంగా అర్హులైన మరికొందరు రైతులకు రైతు రుణమాఫీ సాయం అందలేదు. అలాంటి రైతులకు కూడా మాఫీ సొమ్మును అందించేందుకు గాను ప్రస్తుతం సర్వే నిర్వహిస్తోంది. కాగా, రైతు రుణమాఫీ అమలు కావటంతో అన్నదాతలు రైతు భరోసా పథకం కోసం ఎదురు చూస్తున్నారు.
కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో రైతు భరోసా పథకం కూడా ఒకటి. ఈ పథకం కింద పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ. 15 వేలు ఇస్తామని ప్రకటించింది. ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో కలిపి మెుత్తం రూ. 15 వేలు పంట పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పింది. ఈ మేరకు రైతు భరోసా పథకం అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది.దసరా (అక్టోబర్ 12) నుంచి రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.
 ఎకరాకు రూ.7,500 చొప్పున కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసాను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.అయితే గత ప్రభుత్వం రైతుబంధు పథకం పేరుతో ఎకరాకు రూ. 10 వేలు రెండు విడతల్లో అందించింది. కేబినెట్ సబ్ కమిటీ చేపట్టిన అభిప్రాయ సేకరణలో అత్యధికంగా ఏడున్నర ఎకరాలలోపే పెట్టుబడి సాయం ఇవ్వాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఆ తర్వాత 10 ఎకరాలకు పరిమితం చేయాలనే కూడా కొన్ని ప్రతిపాదనలు కూడా వచ్చాయి. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం  ఈసారి బడ్జెట్లో రైతుభరోసా పథకం అమలు కోసం ప్రభుత్వం రూ.15 వేల కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.  మొత్తం మీద  దసరా పండుగ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను అమలు చేయాలని తలపెట్టడం....రైతున్నలు  ఆనందం వ్యక్తం చేస్తున్నా