ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లు ఆన్లైన్ లో చేర్చాలి 

ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లు ఆన్లైన్ లో చేర్చాలి 

ఆర్ ఓ ఆర్ ముసయిదా బిల్లు 2024 పై చర్చలో వక్తలు 

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: నా లాలు, కుంటలు, చెరువులు కబ్జాలకు గురి కాకుండా ఎల్ టి ఎఫ్, బఫర్ జోన్ ల ఏరియా చూపించేలా పబ్లిక్ డోమైన్ లో పెట్టాలని అధికారులకు వక్తలు సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో తెలంగాణ ప్రభుత్వ నూతన ఆర్ఓఆర్ 2024 ముసాయిదా బిల్లుపై చర్చ వేదిక నిర్వహించారు. ఈ వేదికలో ముందుగా జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక తాసిల్దార్ వెంకటరెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నూతన ఆర్ఓఆర్ 2024 ముసాయిదా బిల్లులోని 20 అంశాలను వివరించారు.


ఈ సందర్భంగా అడ్వకేట్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు, జర్నలిస్టులు, ట్రెసా ( తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్) ప్రతినిధులు వేరువేరుగా  మాట్లాడుతూ కొత్త చట్టంలో భూ రికార్డులు ఆన్లైన్లో పాటు ఆఫ్ లైన్ లో కూడా ఉంచాలని, రైతు కుటుంబం అన్నప్పుడు కుటుంబానికి సరియైన వివరణ పొందుపరచాలని, లీగల్ విల్ డీడ్ చేసినప్పుడు దానినే ప్రామాణికంగా చేసుకొని రిజిస్ట్రేషన్ చేయాలని, ప్రైవేటు భూములతో పాటు ప్రభుత్వ భూములకు, దేవాదాయ భూములకు కూడా కాస్తుదారు ఉండాలని సలహాలు ఇచ్చారు, రెవెన్యూ అధికారులు వివిధ పనులతో బిజీగా ఉంటారు, కాబట్టి భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారాలు సబ్ రిజిస్టార్ల ద్వారా మాత్రమే జరిగేలా చూడాలని, సవరణ రిజిస్టర్ ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. హిడెన్ ఫైల్స్ అనేవి ఉండరాదని, ధరణిలో జరిగిన పొరపాట్లను ఆర్డీవో ద్వారా పరిశీలించి సరి చేసే అధికారం కల్పించాలన్నారు.

భూ సమస్యల శాశ్వత పరిష్కార వేదిక జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయాలని, జవాబుదారితనంతో కూడిన విఆర్ఓ వ్యవస్థను మళ్ళీ ప్రవేశపెట్టాలని, క్షేత్ర స్థాయిలో రెవెన్యూ రికార్డులపై ఆజమాయిషీ తాసిల్దార్ వద్దనే ఉండాలని, రికార్డ్స్ కరెక్షన్ ఆప్షన్ ఆర్డిఓకు ఇవ్వాలని, విల్ డీడ్ చేసినప్పుడు సాక్షులను విచారించి రిజిస్ట్రేషన్ చేయాలన్నారు, మున్సిపల్ ప్రాంతాలలో నాలాలు చెరువులు కబ్జాకు గురి కాకుండా ఎఫ్టిఎల్, బఫర్ జోన్  మ్యాపులు రూపొందించాలని, అప్పీల్ అధికారాలు ఆర్డిఓకు జాయింట్ కలెక్టర్ కి పెట్టాలని, రెవిన్యూ కోర్టులకు బదులుగా  రిటైర్డ్ జడ్జిలు / రిటైర్డ్ కలెక్టర్లు/ రిటైర్డ్ జాయింట్ కలెక్టర్లతో ట్రిబ్యునల్  ఏర్పాటు చేయాలని, ఆర్ఓఆర్ 2024 యాక్టును  ధరణి రిఫరెన్స్ కు బదులుగా 2017 రికార్డు ప్రకారం  రూపొందించాలన్నారు. వివాదాస్పద అంశాలను నిర్ణీత సమయంలోనే పరిష్కరించాలని, ఇప్పుడున్న సాదా బైనామా కేసులను ఆరు నెలల్లో పరిష్కరించి కొత్త సాధా భైనామాలు  జరగకుండా చూడాలని, ఎన్ఐసీ ద్వారా ఆర్ఓఆర్  చట్టాన్ని అమలు చేయాలనే తదితర, సలహాలు సూచనలు ఇచ్చారు.


మీ సలహాలు, సూచనలు రికార్డు చేసి ప్రభుత్వానికి నివేదిస్తాం....జిల్లా కలెక్టర్ మను చౌదరి 

 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి మాట్లాడుతూ తెలంగాణ నూతన ఆర్ఓఆర్ 2024 ముసాయిదా బిల్లు గురించి మేధావులకు, అడ్వకేట్ లకు, ప్రజా ప్రతినిధులకు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు, జర్నలిస్టులకు, ప్రజలకు అవగాహన కల్పించి చట్టంలో పొందుపరచవలసిన 20 అంశాలలో వారి నుండి సలహాలు, సూచనలు తీసుకోవడం కోసం చర్చ వేదిక నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ చర్చా వేదికలో మీరు   ఇచ్చిన సలహాలు, సూచనలను ప్రతి ఒక్కటి రికార్డు చేయడం జరిగిందని ఆ వివరాలను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు.


ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ ఆర్డీవోలు సదానందం, బన్సీలాల్ రామ్మూర్తి, కలెక్టరేట్ ఏవో రెహమాన్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, బార్ అసోసియేషన్ సభ్యులు, ట్రెసా సభ్యులు, జర్నలిస్టులు, ప్రజలు  రెవెన్యూ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.