ఈనెల 2న సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల

ఈనెల 2న సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల

హాజరుకానున్న మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి

రైతుల అవసరాలకు నీటి విడుదల ఎంతో మేలు

డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్

ముద్ర ప్రతినిధి నల్గొండ: రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 2న నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఎడమ కాలువకు నీటిని విడుదల చేయడం జరుగుతుందని డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రోడ్ల భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో సన్న, చిన్న కారు రైతులందరికీ మేలు జరుగుతుందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కనుగుణంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, అసలైన తెలంగాణ ఇప్పుడే వచ్చిందని తెలిపారు.

సాగర్ ఎడమ కాలువ నీటి విడుదల కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తంకుమార్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యుడు జైవీర్ రెడ్డితో పాటు పలువురు శాసనసభ్యులు హాజరవుతారని తెలిపారు. ఎడమ కాలువకు నీటి విడుదల ద్వారా నల్లగొండ, ఖమ్మం జిల్లాలో లక్షలాది ఎకరాలు సేద్యం అవుతాయని, రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సాగర్ రిజర్వాయర్ నిండితేనే ఎడమ కాలువకు నీరు విడుదల చేసే వారిని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా సాగర్ రిజర్వాయర్ లోకి వరద నీరు వచ్చిన వెంటనే నీటిని విడుదల చేయడానికి నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.


గత ఎన్నికల ముందు తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలన్నింటినీ అమలు చేస్తుందని స్పష్టం చేశారు. మొదటి, రెండో విడతల్లో నల్గొండ జిల్లాలో సుమారు రూ.1100 కోట్లకు పైగా రైతులకు రుణమాఫీ జమ అయిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, నల్లగొండ మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, మాజీ కౌన్సిలర్ మందడి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాదూరి శ్రీనివాస్ రెడ్డి, కత్తుల కోటి, జూలకంటి సైదిరెడ్డి, పిల్లి గిరి, కూసుకుంట్ల రాజిరెడ్డి, యరమాద మోహన్ రెడ్డి, నరేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.