యాదాద్రి భక్తులకు బిగ్ షాక్.. ఇక నుంచి గుట్టపై ఫొటోలు, వీడియోలు నిషేధం..ఈవో
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. అద్భుతమైన శిల్పకళతో అబ్బురపోయేలా తీర్చిదిద్దిన ఆలయాన్ని దర్శించుకునేందుకు తెలంగాణ నుంచే కాకుండా పక్కనున్న రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విచ్చేస్తుంటారు. అయితే.. స్వామివారిని దర్శించుకోవటంతో పాటు.. ఆలయ శిల్పకళను చూసి ముగ్దులవుతున్నారు. ఈ క్రమంలోనే.. ఆలయ ప్రాంగణంలో ఫొటోలు, వీడియోలు తీసుకుని మురిసిపోతున్నారు. అయితే.. ఫొటోలు, వీడియోలు తీసుకోవటం రోజురోజుకు పెరిగిపోతుండటంతో.. ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఆలయంలో ఫొటోలు, వీడియోలు తీయడాన్ని నిషేధిస్తూ కీలక ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో భాస్కర్ రావు మంగళవారం (అక్టోబర్ 22న) అధికారికంగా ప్రకటించారు.
ఆలయ ప్రతిష్టకు భంగం కలగకుండా.. భక్తుల మనోభావాలు, విశ్వాసానికి ఆటంకం ఏర్పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. అయితే.. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు మాఢవీధుల్లో కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలు దిగితే తమకేం అభ్యంతరం లేదని అధికారులు చెప్తున్నారు. అయితే.. వ్యక్తిగత కార్యక్రమాలకు ఆలయాన్ని ఉపయోగించుకుంటే ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుందన్న కారణంతోనే.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు.