మంత్రి గారు సమయం ఇచ్చేనా...!
పెండింగ్ లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు
సిద్దిపేట, గజ్వెల్ ల్లో చెక్కులు సిద్ధం, పంపకమే తరువాయి.
లబ్ధిదారుల ఎదురుచూపులు
సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : పేద జంటల వివాహాల కోసం ప్రభుత్వం తెచ్చిన కల్యాణ లక్ష్మి, శాది ముబారక్ చెక్కులు పార్లమెంట్ ఎన్నికల నుండి పెండింలోనే ఉన్నాయి. అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్టు ఉన్నది వ్యవహారం. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న వారికి చెక్కులు సిద్ధంగా ఉన్న అవి అందజేయడానికి సమయం లేదు. వినడానికి విడ్డురంగా ఉన్న ఇదే నిజం.. పార్లమెంట్ ఎన్నికల నుండి ఇప్పటివరకు అబ్ధిదారులకు ఒక్క చెక్కు కూడా అందలేదు.ఆడబిడ్డ పెళ్లి చేసేందుకు అపోసప్పు చేసిన తల్లిదండ్రులకు ఆర్థిక కష్టాలు తీరడం లేదని కళ్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డలకు పెళ్లిళ్లు చేసి సుమారు 6 నెలలు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కళ్యాణ లక్ష్మి షాదీ, ముబారక్ పథకం అందడం లేదంటూ వాపోతున్నారు. సిద్ధిపేట జిల్లాలో చెక్కులు రెడీ ఉన్నప్పటికీ పంపిణీ చేసేందుకు పాలకులు అందుబాటులో లేకపోవడం విడ్డూరంగా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనల మేరకు జిల్లాలో సంక్షేమ పథకాల పంపిణీ ఇన్చార్జి మంత్రి చేతుల మీదుగా జరగాల్సి ఉంటుంది, సిద్దిపేటకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖ ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నారు.
జూన్ మూడవ తేదీ వరకు పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంవల్ల పంపిణీ చేయలేకపోయారు. కానీ ఎన్నికల కోడ్ ముగిసి రెండు నెలలు గడుస్తున్నా ఇన్చార్జి మంత్రి కనికరించడం లేదంటూ లబ్ధిదారులు విలపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నగదు మొత్తాన్ని పెంచడంతోపాటు ప్రతి ఆడబిడ్డకి తులం బంగారం అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ బంగారం ఇచ్చుడు ఇవ్వకపోవడం పక్కన పెడితే ఇదివరకు ఇచ్చిన కనీసం నగదు అయిన అందిస్తారని ఆశిస్తున్నామని లబ్ధిదారులు వేడుకుంటున్నారు. ఇన్చార్జి మంత్రి తక్షణమే స్పందించి తమకు కల్యాణ లక్ష్మి చెక్కులు అందించాలని కోరుకుంటున్నారు. సిద్దిపేట డివిజన్లో 700 గజ్వేల్ డివిజన్లో 500 దుబ్బాక నియోజకవర్గం లోని పలు మండలాలలో ఇప్పటివరకు ఆర్డీవో స్థాయి అప్రోలు జరగకపోవడం వల్ల వందల సంఖ్యలో చెక్కులు పెండింగ్ ఉన్నట్లు బాధితులు తెలిపారు.
ఈ విషయమై సిద్దిపేట, గజ్వెల్ ఆర్ డి ఓ లను వివరణ కోరగా అధికారుల సూచన మేరకు డివిజన్ స్థాయిలలో ఇప్పటివరకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని వారు తెలిపారు. జిల్లా ఉన్నత అధికారుల సూచన మేరకు పంపిణీ ఏర్పాటు చేస్తామని అన్నారు . లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ పంపిణీకి సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.