కేటీఆర్ విష ప్రచారం ఎందుకు చేస్తున్నవ్ 

 కేటీఆర్ విష ప్రచారం ఎందుకు చేస్తున్నవ్ 
BJP state spokesperson Rani Rudrama fire on KTR
  • బండి తెచ్చిన నిధులు నీకు తెల్వదు
  • * బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ

ముద్ర, కరీంనగర్ ప్రతినిధి: బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ పై విష ప్రచారం ఎందుకు చేస్తున్నవ్ కేటీఆర్ అంటూ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ మండిపడ్డారు. కరీంనగర్ లో బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. జగిత్యాల- కరీంనగర్- వరంగల్ నేషనల్ హైవే, సిద్దిపేట-హుస్నాబాద్ -ఎల్కతుర్తి రెండు వరుసల రహదారి పనులు పురోగతిలో ఉన్న విషయం కేటీఆర్ కు తెలవదు అన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కోసం  ఎంపీ బండి సంజయ్  నిధులు మంజూరు చేయించిన విషయం మీకు తెలువదా అని ప్రశ్నించారు. ఇవే కాకుండా వందల కోట్లతో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

మంగళవారం కరీంనగర్ పర్యటనలో కేటీఆర్ మాట్లాడిన మాటలను ఆమె తప్పు పట్టారు. ఈటల రాజేందర్ ఆరు పర్యాయాలు ఎమ్మెల్యే గెలిచిన నికార్సైన ఉద్యమ నేత అని అతనిపై మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మరని విమర్శించారు. రాచరికపోకడలో నియంతృత్వాన్ని ప్రదర్శిస్తే ప్రజల సహించరని హెచ్చరించారు. విద్యుత్ ఎడిసి, 150 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు, పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేని స్థితికి తెలంగాణ దిగజారిపోవడం కెసిఆర్ పాలనకు నిదర్శనం అన్నారు. గ్యారంటీ అప్పుల్లో తెలంగాణ టాప్ పొజిషన్లో ఉందని విమర్శించారు. ఈ సమావేశంలో బిజెపి కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు,జిల్లా ఆఫీస్ సెక్రటరీ మాడుగుల ప్రవీణ్, జిల్లా మీడియా కన్వీనర్ కటకం లోకేష్, జిల్లా అధికార ప్రతినిధులు బొంతల కళ్యాణ్ చంద్ర, ఎడమ సత్యనారాయణ రెడ్డి, జెల్ల సుధాకర్, కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బల్బీర్ సింగ్, కార్పొరేటర్ రాపర్తి విజయ, ఆవుదుర్తి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.