జనసేన పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యేలు టీవీ రామారావు, ఈదర హరిబాబు
ఏపీ రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యేలు టీవీ రామారావు (కొవ్వూరు), ఈదర హరిబాబు (ఒంగోలు) జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదర స్వాగతం పలికారు. వారితో పాటే మరికొందరు కూడా జనసేనలో చేరారు. ఈదర హరిబాబు టీడీపీలో సుదర్ఘీకాలం పాటు కొనసాగారు. ఎన్టీఆర్ ఆశయాలతో పార్టీ పట్ల ఆకర్షితుడైన ఈదర 1994లో ఒంగోలు ఎమ్మెల్యేగా, 2014లో ప్రకాశం జడ్పీ చైర్మన్ గా వ్యవహరించారు.ఇక తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ శాసనసభ్యుడు టీవీ రామారావు ఇటీవలే వైసీపీకి గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు.
టీవీ రామారావు 2009లో టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఆయనకు టికెట్ రాకపోవడంతో వైసీపీలో చేరారు. గత కొంతకాలంగా ఆయన వైసీపీ తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారు. 2019 ఎన్నికల్లో కొవ్వూరు నుంచి తానేటి వనితను గెలిపిస్తే, మంచి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని, కానీ ఆ తర్వాత జగన్ ను కలిసే అవకాశం కూడా రాలేదని టీవీ రామారావు రాజీనామా సందర్భంగా చెప్పారు. తన వెంట నిలిచిన పార్టీ కార్యకర్తలకు ఏమీ చేయాలకపోయానన్న బాధ కలుగుతోందని అన్నారు.