చంద్రబాబు ఉచ్చులో ఉన్నంత కాలం షర్మిల మాకు రాజకీయ శత్రువే: మంత్రి పెద్దిరెడ్డి
- వైఎస్సార్ కుటుంబంలో చంద్రబాబు చిచ్చుపెడుతున్నారన్న పెద్దిరెడ్డి
- వైఎస్ కుటుంబం విడిపోవడానికి చంద్రబాబే కారణమని ఆరోపణ
- షర్మిల కాంగ్రెస్ లో చేరడం చంద్రబాబు కుట్ర అని వెల్లడి
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. వైఎస్సార్ కుటుంబంలో చంద్రబాబు చిచ్చుపెడుతున్నారని అన్నారు. వైఎస్సార్ కుటుంబంలో చీలికలు రావడానికి ముఖ్య కారకుడు చంద్రబాబేనని, షర్మిల కూడా చంద్రబాబు ఉచ్చులో పడ్డారని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఉచ్చులో ఉన్నంత కాలం షర్మిలను తాము రాజకీయ శత్రువుగానే భావిస్తామని స్పష్టం చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందని... కాంగ్రెస్ లో ఉన్నవాళ్లంతా ఎప్పుడో వైసీపీలోకి వచ్చేశారని వివరించారు. రఘువీరా, షర్మిల, గిడుగు రుద్రరాజు, కేవీపీ.. ఈ నలుగురు మాత్రమే చచ్చిన కాంగ్రెస్ పార్టీని మోస్తున్నారని ఎద్దేవా చేశారు.