అణుదాడులతో మానవాళి వినాశనం

అణుదాడులతో మానవాళి వినాశనం
  • అమెరికా దాడికి 78 యేళ్లు..
  • మృతులకు ప్రధాని కిషిడా నివాళులు
  • రష్యా బెదిరింపులను ఖండించిన ఐరాస చీఫ్

​జపాన్​: హిరోషిమాపై అణుదాడి జరిగిన 78వ వార్షికోత్సవం సందర్భంగా జపాన్​ప్రధాని ఫుమియో కిషిడా మృతిచెందిన వారికి నివాళులర్పించారు. 1945లో, హిరోషిమాలో 8:15 గంటలకు అమెరికా అణుబాంబు దాడి చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఆదివారం ఉదయం 8:15 గంటలకు, అందరూ 1 నిమిషం పాటు మౌనం పాటించారు. అణుదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు చేశారు. ఈ వేడుకకు 50 వేల మందికి పైగా హాజరు కాగా అందరూ నల్లటి దుస్తులను ధరించి పాల్గొనడం విశేషం. ప్రధాని కిషిడా మాట్లాడుతూ- ప్రపంచాన్ని అణు రహిత దేశంగా మార్చే మార్గం మరింత కష్టతరమవడం తమను కలచివేస్తోందన్నారు.  అంతర్జాతీయ సమాజంలో ప్రస్తుతం పలు దేశాల మధ్య నెలకొన్న యుద్ధవాతావరణమే ఇందుకు కారణమన్నారు. అణుదాడి విధ్వంసాలను తమ దేశం సహించిందని, భరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. - ఉక్రెయిన్‌లో రష్యా అణు దాడిని నిరంతరం బెదిరిస్తోందని, దానికి తాము అంగీకరించేది లేదన్నారు. మానవాళి వినాశనానికే అణుదాడి దారితీస్తుందన్నారు. రెచ్చగొట్టే, పరిస్థితులు విషమించే చర్యలు మానుకొని అంతర్జాతీయ సమాజంలో పాల్గొని శాంతి చర్చలతోనూ సమస్యను పరిష్కరించుకోవచ్చని ప్రధాని కిషిడా పేర్కొన్నారు. కాగా ఈ వేడుకల్లో అణుదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులు, బంధువులు, 111 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఈ యుద్ధ సమయంలో, ప్రపంచం మొత్తాన్ని అణ్వాయుధ రహితంగా మార్చడానికి అందరూ కలిసి పనిచేయాలి. హిరోషిమాపై దాడి జరిగిన వార్షికోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ- కొన్ని దేశాలు అణుదాడి చేస్తామని నిరంతరం బెదిరించుకుంటున్నాయన్నారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది సహించబోమన్నారు. ఏదైనా సమస్యను ఎదుర్కోవాలంటే ప్రపంచం మొత్తం ఏకమై పరిష్కరించుకునే మార్గం కూడా ఉందని గుటెర్రెస్​ అన్నారు.