సమన్వయంతో విజయం సాధిస్తాం

సమన్వయంతో విజయం సాధిస్తాం
  • లక్ష మెజార్టీ తో ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు
  • కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే లక్ష్యం
  • మీట్ ది ప్రెస్ లో మంత్రి సీతక్క

ముద్ర ప్రతినిధి, నిర్మల్:రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగుతోందని, సమన్వయంతో పనిచేసి విజయం సాధిస్తామని రాష్ర్ట పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. నిర్మల్ లో శనివారం జరిగిన మీట్ ది ప్రెస్ లో ఆమె మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా చరిత్రలో మొదటి సారి ఆదివాసీ మహిళకు టికెట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ కు దక్కిందని ఆమె అన్నారు. ఉపాధి హామీ కూలీగా ఇందిరమ్మ ఇంటి నుంచి బయటకు వచ్చి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉన్న సుగుణకు టికెట్ ఇచ్చి తమ పార్టీ పేదలకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలిపిందన్నారు. గత పదేళ్లుగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. ఆర్మూర్ - ఆదిలాబాద్ రైల్వే లైన్ అతీగతీ లేదన్నారు. తమ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఫలితంగానే ఇచ్చిన ఆరు హామీల్లో ఐదు పూర్తి కావస్తున్నాయని అన్నారు. సంపద పెంచటం, పేదలకు పంచటమే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన సాగిస్తోందని అన్నారు. 

విమర్శించిన వారిని కూడా పార్టీలోకి...

తమను, తమ పార్టీని విమర్శించిన వారిని కూడా పార్టీ శ్రేయస్సు దృష్ట్యా చేర్చుకున్నామని స్పష్టం చేశారు. త్యాగాలకు మారు పేరైన రాహుల్ గాంధీ కుటుంబం కోసమే ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. గతంలో అవినీతి ఆరోపణలు ఉన్న నేతలను కూడా ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ పార్టీలో చేరినా చట్టం తనపని తాను చేస్తుందని అన్నారు. 

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు

రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కాంగ్రెస్ కృత నిశ్చయంతో ఉందని ఆమె అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి ఈ దిశగా చర్యలు చేపడుతున్నారని అన్నారు. 

ఆదివారం నిర్మల్ కు రాహుల్

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్మల్ కు రానున్నారని ఆమె తెలిపారు. సిఎం రేవంత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. నిర్మల్ బహిరంగ సభకు నిర్మల్, ముథోల్, ఖానాపూర్, బోథ్ నియోజక వర్గాలనుండి సుమారు 65 వేలమంది తరలి రానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు శ్రీహరి రావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ, నిర్మల్ మునిసిపల్ చైర్మన్ ఈశ్వర్, శ్రవణ్ కుమార్ రెడ్డి, సత్తు మల్లేష్ తదితరులు ఉన్నారు.