జగదీష్ రెడ్డి పై సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి వ్యాఖ్యలు

జగదీష్ రెడ్డి పై సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి వ్యాఖ్యలు
  • జానారెడ్డి ని విమర్శించే స్థాయి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి లేదు
  • జానారెడ్డి పై విమర్శలు ఖండిస్తున్నాం

సూర్యాపేట ముద్ర ప్రతినిధి:-మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కుందూరు జానారెడ్డిని విమర్శించే స్థాయి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్ రెడ్డికి లేదని, జానారెడ్డి పై జగదీష్ రెడ్డి చేసిన విమర్శలను ఖండిస్తున్నామని మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేటలోని రెడ్ హౌస్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

10ఏండ్లు మంత్రిగా ఉండి జిల్లాలో చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. సూర్యాపేట లో ఏమి అభివృద్ధి చేశారో చర్చకు రావాలని డిమాండ్ చేశారు.ఎస్సారెస్పీ, గోదావరి జలాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు.విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి ఉండి కనీసం సబ్ స్టేషన్లు కూడా తేలేదని,440, 132, 14 33కేవీ సబ్ స్టేషన్లు కాంగ్రెస్ తీసుకొస్తే జగదీశ్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.డబ్బుల కోసం సద్దల చెరువును సుందరికరణ పేరుతో చెరువు కెపాసిటీ తగ్గించారని ఆరోపించారు.10ఏండ్ల కాలంలో గ్రామాలకు రోడ్లు కూడా వేయలేదని దుయ్యబట్టారు.మిషన్ భగీరథ కు ముందు పాలేరు నుండి కృష్ణ జలాలను కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన విషయం మరువరాదన్నారు. నేషనల్ హై వే వెడల్పు పేరుతో పేదల ఇండ్లను నష్ట పరిహారం ఇవ్వకుండా కూల్చేశారని విమర్శించారు.సూర్యాపేట ఏ వార్డులో అభివృద్ధి చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.2014 లో జగదీశ్ రెడ్డి ఆస్తుల ఎన్ని, ఇప్పుడు ఎన్నో దమ్ముంటే వాస్తవ వివరాలు వెల్లడించాలన్నారు. 

ప్రజాదర్బార్ లో బీఆర్ఎస్ నాయకుల భూకబ్జాలు సూర్యాపేట ప్రజలందరూ విన్నవిస్తున్నారని తెలిపారు.కేసీఆర్ పక్కన జగదీశ్ రెడ్డి స్థానం ఎంతో అందరికి తెలుసన్నారు.ప్రతిపక్ష నాయకుడిగా సలహాలు ఇవ్వాలని, అంతేగాని అర్థంపర్థం లేని అసత్య విమర్శలు చేయకూడదని హితవు ఫలితాలు.ప్రభుత్వ భూములు ఉన్న రియల్టర్ల దగ్గర జగదీశ్ రెడ్డి డబ్బులు కమిషన్లుగా తీసుకొని కలెక్టరేట్ నిర్మాణం చేశారని ఆరోపించారు.ప్రభుత్వ ఆసుపత్రులపై ఎన్నడైనా ఎప్పుడైనా సమీక్ష నిర్వహించారా అని ప్రశ్నించారు.సంత్ నిరంకారి పేరిట పేదల భూములు లాక్కున్న విషయం వాస్తవం కాదా అని దుయ్యబట్టారు.58, 59 జీవో ద్వారా 40 మంది అనుచరులకు, కోటీశ్వరులకు ప్రభుత్వ భూములను కట్టబెట్టావని, ప్రభుత్వ భూములను బీ ఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారని వెల్లడించారు.

ఎస్సారెస్పీ కాలువకు తూములు కూడా బీ ఆర్ఎస్ ప్రభుత్వం పెట్టించలేదన్నారు. సద్దలచెరువుసుందరికరణ పేరుతో చేసిన ఖర్చుల  వివరాలు చెప్పే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. సూర్యాపేట అభివృద్ధి పై చర్చకు తాము సిద్ధమని, మీరు కూడా సిద్ధంగా ఉండాలని సవాలు విసిరారు.కాంగ్రెస్ హయాంలో 10వేల  ఇందిరమ్మ ఇండ్లు కట్టించామని, టిఆర్ఎస్ ప్రభుత్వం అరకొరగా కట్టించిన డబుల్ బెడ్ రూములు నేటికీ లబ్ధిదారులకు అందజేయలేదన్నారు.గులాబీ కండువా కప్పుకున్న వారికే సంక్షేమ పథకాలు అందించారని, మిగతా ఇతర పార్టీలో చెందిన పేదలను సైతం విస్మరించారని విమర్శించారు. నాడుజానారెడ్డి మంత్రిగా ఉండి ఎంతో అభివృద్ధి చేశారని స్పష్టం చేశారు.

సూర్యాపేట లో జరిగిన అవినీతి పై కమిటీ వేసి నిజాలను బట్టబయలు చేస్తాం అని హెచ్చరించారు.కాంగ్రెస్ పార్టీ త్యాగాల పునాదుల పై నుండి వచ్చిందని, ప్రత్యేక రాష్ట్రం కోసం అమాయకుల విద్యార్థులు ప్రాణత్యాగం చేస్తే మీరు చేసినట్టు గొప్పగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీఅని, సోనియాగాంధీ తెలంగాణ తల్లి అని, ఆనాడు సాహసోపేత నిర్ణయం తీసుకోవడం వలన తెలంగాణ కల సహకారం ఆయన విషయాన్ని ఈ తెలంగాణ పౌరులు మరవరున్నారు.రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్, కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్  కావాలని అడిగింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. సూర్యాపేట మెడికల్ కళాశాల ఔట్ సోర్సింగ్ నియామకాలలో అవకతవకలు జరిగాయని,బంధువులు, బినామిలకు ఉద్యోగాలు ఇచ్చారని, ఒకే గ్రామం నుండి 60మందికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చి అవినీతికి పాల్పడ్డారన్నారు.

విద్యాశాఖ మంత్రిగా జగదీష్ రెడ్డి పనిచేసినప్పటికీ సూర్యాపేటకు ఒక మహిళ జూనియర్ కాలేజ్, ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజి తీసుకరాలేదని, ఏదో సాధించినట్టు ఎంతో చేసినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు.ఎన్నికల అనంతరం ప్రతి డిపార్ట్మెంట్ పై సమీక్ష చేసి అవినీతి, అక్రమాలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.గత ప్రభుత్వ హయాంలో చేసిన అక్రమాలతో మున్సిపాలిటీ లో జనరల్ ఫండ్ లేని పరిస్థితి దాపురించిందన్నారు. దమ్ముంటే ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి లెక్కలు తీసుకొని చర్చకు రావాలని దామోదర్ రెడ్డి సవాల్ విసిరారు. తాము10ఏండ్లలో ఏ నాడు వ్యక్తిగత విమర్శలు, అసత్య ఆరోపణలు చేయలేదని వెల్లడించారు.

లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి కి 40వేల మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల మొగ్గు చూపుతున్నారని కాంగ్రెస్ పార్టీ అంటే తమ సమస్యలు పరిష్కరించే పార్టీగా విశ్వాసం చూపుతున్నారని వివరించారు.బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ సొంత ఇంటి వ్యవస్థ గా వాడుకున్నారని,రౌడీ ఇజం, గుండాయిజం లేకుండా పని చేయాలని ప్రభుత్వం  స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడంతోనే ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని ,బాధలు చెప్పుకునే అవకాశం వచ్చిందని, ప్రజా దర్బార్లో అనేక ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నామని వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  అంజద్ అలీ, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్  కక్కిరేణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.