‘ఇండియా’ లోగో సిద్ధం

‘ఇండియా’ లోగో సిద్ధం
  • ముంబై సమావేశంలో ఆవిష్కరణ!
  • మూడో సమావేశానికి ఉద్ధవ్​ఠాక్రే ఆతిథ్యం

న్యూఢిల్లీ: ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్(ఇండియా) లోగో సిద్ధమైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని పలు విపక్ష పార్టీలతో కలిపి కూటమి పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా కూటమికి సంబంధించి లోగో సిద్ధమైందని, ఆగస్టు 31 లేదీ సెప్టెంబర్ 1 తేదీల్లో ముంబైలో విపక్ష కూటమి సమావేశంలో లోగోను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా ఇండియా కూటమికి రెండు సమావేశాలు ముగిశాయి. ముంబైలో జరగనున్న మూడో సమావేశానికి శివసేన(ఉద్ధవ్ బాల్ థాక్రే) వర్గం అధినేత, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆతిథ్యమిస్తున్నారు. ప్రతి సమావేశానికి కూటమిలో భాగస్వామ్య పార్టీల సంఖ్యాబలం పెరుగుతూ వస్తోంది. పాట్నా సమావేశంలో సుమారు 17 పార్టీలకు చెందిన 32 మంది హాజరవగా.. బెంగళూరు సమావేశంలో 26 పార్టీలు పాల్గొన్నాయి. దేశ ఆర్థిక రాజధానిలో జరిగే కూటమి మూడో సమావేశంలో 26 కంటే ఎక్కువ రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 80 మంది నేతలు హాజరయ్యే అవకాశం ఉందని కూటమి వర్గాలు వెల్లడించాయి.

  • ఏర్పాట్లలో మహావికాస్ అఘాడి నిమగ్నం..

కూటమి మూడో సమావేశాన్ని సక్సెస్​చేసేందుకు ప్రణాళికలతో పనిచేస్తున్నట్టు మహారాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నసీమ్ ఖాన్ తెలిపారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్‌ సహా మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) నాయకులంతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని చెప్పారు.