బీఆర్ఎస్ మండల అధ్యక్షునిపై కేసు నమోదు

బీఆర్ఎస్ మండల అధ్యక్షునిపై కేసు నమోదు

ముద్ర, ఎల్లారెడ్డిపేట:  ఎల్లారెడ్డిపేట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి పై ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన వరుస కృష్ణ హరి తప్పుడు సర్వే నెంబర్ తో మరొకరికి భూమిని విక్రయించినందుకు కేసు నమోదయింది. కృష్ణ హరి తో పాటు మరో 15 మందిపై  కోర్టు ఆదేశాలతో ఎస్సై కేసు నమోదు చేశారు. రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన కొండపురం శ్రీనివాస్ కుటుంబానికి సంబంధించిన వ్యవసాయ భూమిని కృష్ణ హరి మూడేళ్ల క్రితం తప్పుడు ఆధారాలతో భూమిని కబ్జా చేసి అట్టి భూమిని కామారెడ్డి జిల్లాకు  చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మేశాడు భూమిని కొనుగోలు చేసిన సదరు వ్యక్తులు అట్టి భూమిలో నాలా అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్లు పెట్టి భూమిని విక్రయించారు. 

నాలా అనుమతులకు సంబంధిత ప్రభుత్వ శాఖల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్లు పెట్టి భూమి విక్రయాలు జరిపారు. విషయం తెలుసుకున్న భూమి యజమానులు కొండపురం శ్రీనివాస్ ఆయన కుమారుడు అడ్వకేట్ అయిన వెంకట్ రెడ్డి లు కలిసి తమ భూమిని కృష్ణ హరి కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించారని హైకోర్టును ఆశ్రయించగా  కేసును పూర్వపరాలు పరిశీలించిన అనంతరం  తప్పుడు సర్వే నెంబర్లతో ఇతరుల భూమిని విక్రయించిన వరుస కృష్ణ హరి తో పాటు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా భూమి కొనుగోలు చేసి ప్లాట్లు పెట్టి విక్రయించిన వారందరిపై కేసు నమోదు చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించగా కోర్టు ఆదేశానుసారం ఎస్సై కేసు నమోదు చేశారు. వరుస కృష్ణ హరిని వివరాలు కోరగా మేము కొనుక్కున్న భూమి అని అవసర నిమిత్తం  విక్రయించడం జరిగిందని నా మీద బురద జల్లాలని ప్రయత్నంలో భాగంగా పనిగట్టుకుని తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కోర్టు మీద గౌరవం ఉందని న్యాయపరంగా ఎదురుకుంటానని అన్నారు.