ముక్తినాథ్​ ఆలయ సందర్శన

ముక్తినాథ్​ ఆలయ సందర్శన
  • కేబుల్​ కార్​ పనుల్లో పుంజుకున్న వేగం
  • (ఎస్​.హనుమంత్​ రావు)

నేపాల్​: ప్రముఖ ప్రాజెక్టు భారత్​–నేపాల్​ మధ్య సంబంధాల పెంపునకు అత్యున్నత ప్రమాణాలతో నేపాల్​లో నిర్మిస్తున్న నయాపుల్​/బీరేతాటి–ముక్తినాథ్​ కేబుల్​ కార్​ ప్రాజెక్టు పనుల్లో వేగం పుంజుకుంది. ఈ ప్రాజెక్టు వేగవంతానికి హైదరాబాద్​కు చెందిన ముక్తినాథ్​ కేబుల్​కార్​ ప్రైవేట్​ లిమిటెడ్​, కేఆర్​ రైల్​ ఇంజనీరింగ్​ లిమిటెడ్​ల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. ఈ ప్రాజెక్టు కోసం నేపాల్​కు చైనా ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించడం విశేషం. ప్రాజెక్టు భూసేకరణ 90 శాతం పూర్తికాగా, డీపీఆర్​ చివరి దశలో ఉంది. పర్యావరణంపై ప్రాజెక్టు వల్ల కలిగే పరిణామాల అధ్యయనం కూడా చివరి దశకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ. 55 బిలియన్లు. ఇప్పటికే రుణానికి సంబంధించిన పనులు కూడా చివరి దశలో ఉన్నట్లు ప్రాజెక్టు పనుల్లో భాగస్వాములైన సంస్థలు వెల్లడించాయి.

అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 48 నెలల్లో పూర్తి చేయాలని నేపాల్​ ప్రభుత్వంతో ఈ సంస్థలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ముక్తినాథ్ ఆలయాన్ని సందర్శించే వారికి కేబుల్ కార్ ప్రాజెక్ట్ కీలకం కానుంది. ఈ ఆలయం ద్జోంగ్ ఖోలా లోయ పైభాగంలో ఉండడంతో భక్తులు అక్కడికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నిర్మిస్తే మరింత పర్యాటక రంగ అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. నేపాల్ టూరిజం బోర్డు విడుదల చేసిన డేటా ప్రకారం, 2023 సంవత్సరంలో అత్యధికంగా నేపాల్‌కు వెళ్ళిన వారిలో భారతదేశ పర్యాటకులు ఉన్నారు. పర్యాటకులు 6 లక్షలు కాగా అందులో రెండు లక్షలు భారతీయులే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఈ దేవాలయాన్ని సందర్శించే, ఇక్కడి ప్రకృతిని ఆస్వాదించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో కూడా నేపాల్​ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు రూపకల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది.