ప్రజా సంక్షేమానికి కట్టుబడి పని చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ - షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్

ప్రజా సంక్షేమానికి కట్టుబడి పని చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ - షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్

ముద్ర/షాద్ నగర్: ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు కట్టుబడి పని చేస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ వివరించారు. ఆదివారం షాద్ నగర్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఉద్యమ నాయకుడు, టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు మంగులాల్ నాయక్ మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ ఆధ్వర్యంలో కొత్తూరు మండలం కేంద్రంలో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ గడీల పాలనను బద్దలు కొట్టి ప్రజా పాలన తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రణాళికబద్ధంగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని వివరించారు. తెలంగాణ నినాదంతో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మత విద్వేషం రెచ్చగొట్టే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజల్లోకి వస్తున్నారని వీరిని నమ్మేస్థితిలో ఎవరు లేరని మండిపడ్డారు. పదేళ్లు ప్రజలు అధికారం ఇస్తే కార్పొరేట్ శక్తుల కొమ్ము కాషారే తప్ప బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుదేరాని అన్నారు.

ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రయోజనాల కోసం వ్యవహరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వివరించారు. వరుస ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున 6 గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కొంత సమయం పడుతుందని, ఇప్పటికే ఐదు గ్యారంటీలను అమలు చేశామని గుర్తు చేశారు. 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలను అమలు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పై బురదజల్లే విధంగా టిఆర్ఎస్ వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఏ గ్రామానికి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వివరించారు. పార్టీలోకి కొత్తవారు వచ్చిన పాత వారికి సముచిత స్థానం కల్పించేందుకు అధిష్టానం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని వివరించారు.

పార్టీలో పని చేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని పేర్కొన్నారు. ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు తాము అన్ని విధాల సిద్ధంగా ఉన్నామని వివరించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా ఉన్న చల్లా వంశీ చందు రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యుడు శ్యాంసుందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు హరినాథ్ రెడ్డి, జంగా నరసింహ, పట్టణ అధ్యక్షుడు కొంకల చెన్నయ్య, కేశంపేట జడ్పిటిసి సభ్యురాలు తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి తోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.