కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చారిత్రాత్మక దినం... మేడే  సందర్భంగా కార్మిక సోదరులందరికీ శుభాకాంక్షలు. తమ కష్టంతో ప్రగతి పూర్వక సమాజ నిర్మాణానికి చేయూతమిచ్చే శ్రామికుల హక్కులను కాపాడటంలో తెలుగుదేశం ఎల్లప్పుడూ ముందుంటుంది. ఇందులో భాగంగా నిన్న విడుదల చేసిన 2024 ఎన్నికల కూటమి మేనిఫెస్టోలో కూడా కార్మిక సంక్షేమానికి పెద్ద పీట వేసాం.    

రవాణా రంగ కార్మికుల కోసం డ్రైవర్‌ సాధికార సంస్థ ఏర్పాటు చేసి అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద బీమా, హెల్త్‌ ఇన్సూరెన్స్‌, విద్యా రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తాం. డ్రైవర్లను ఓనర్లు చేసే లక్ష్యంతో వాహన కొనుగోళ్లకు రూ.4 లక్షల వరకు పొందే రుణాలపై 5% పైబడిన వడ్డీ సబ్సిడీని ఇస్తాం. బ్యాడ్జ్‌ కలిగిన ప్రతి ఆటో, ట్యాక్సీ డ్రైవర్‌కు, హెవీ లైసెన్స్‌ కలిగిన ప్రతి లారీ, టిప్పర్‌ డ్రైవర్‌కు ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం అందజేస్తాం. గత ప్రభుత్వంలో మాదిరిగా ఈ చేత్తో సాయం ఇచ్చి ఆ చేత్తో పదింతలు జరిమానాలతో తిరిగి లాగేసుకునే మాయలు మేము చేయం. అందుకే జీవో 21 రద్దు చేసి ఫైన్‌ల భారం తగ్గిస్తాం. అలాగే వాహనాలపై వైసీపీ ప్రభుత్వం పెంచిన గ్రీన్‌ ట్యాక్స్‌ ను తగ్గించడానికి కృషిచేస్తాం. ఇకపోతే గత టీడీపీ ప్రభుత్వంలో అమలుచేసిన చంద్రన్న బీమా పథకాన్ని  పునరుద్ధరించి అసంఘటిత కార్మికులందరికీ వర్తింప చేస్తాం.  సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు బీమా సౌకర్యం కలిగిస్తాం. భవన నిర్మాణ బోర్డును  పునరుద్ధరిస్తాం. ముఠా కార్మికుల సంక్షేమానికి సైతం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తాం. కార్మిక సంక్షేమమే పరమావధిగా మేము తీసుకున్న ఈ నిర్ణయాలను చిత్తశుద్ధితో అమలుచేస్తామని హామీ ఇస్తూ... మరోసారి కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు.