జగిత్యాలలో పట్టు కోల్పోతున్న బిఆర్ఎస్ 

జగిత్యాలలో పట్టు కోల్పోతున్న బిఆర్ఎస్ 
  • జిల్లాలో బిఆర్ ఎస్ పార్టీ నుంచి రోజుకొకరు చేజరుతున్న నాయకులు 
  • జగిత్యాలలో 6గురు  బి ఆర్ ఎస్ కౌన్సిలర్ల మూకుమ్మడి రాజీనామా 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ రోజురోజుకు పలచన అవుతూ పట్టుకోల్పోతుంది. ముఖ్యంగా జగిత్యాల పట్టణంలో గత ఏడాదికాలంగా చూసినట్లయితే జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ గా పని చేసిన డా.  బోగ శ్రావణీ ఎమ్మెల్యేకు, చైర్పర్సన్ కి మధ్య పార్టీ అంతర్గత వ్యవహారాల్లో పోసుగక శ్రావణి బిఆర్ఎస్ పార్టీకి, మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసి బయటికి వచ్చారు. కొద్దిరోజుల తర్వాత బిజెపిలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి అటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ఇటు  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లకు ముచ్చెమటలు పట్టించారు. ఏడాదికాలంగా ఖాళీగా ఉన్న చైర్పర్సన్ పదవిని భర్తీ చేసేందుకు బిఆర్ఎస్ ప్రయత్నం చేసి చైర్ పర్సన్ గా సమిండ్ల వాణికి మద్దతు తెలపాలని బిఆర్ఎస్ కౌన్సిలర్లను ఎమ్మెల్యే క్యాంపు తరలించినప్పటికీ.. కౌన్సిలర్లు బి ఆర్ ఎస్ రెబల్ అభ్యర్థి అయిన అడ్వాల జ్యోతి లక్ష్మణ్ ను  చైర్ పర్సన్ గా ఎన్నుకున్నారు.  దీంతో చైర్ పర్సన్ గా ఎన్నికైన అడ్వాల జ్యోతి లక్ష్మణ్ తర్వాత బిఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అటు తరువాత ఒక్కరొక్కరుగా బిఆర్ఎస్ కౌన్సిలర్లు గుగ్గిల హరీష్, మస్క్ నారాయణరెడ్డి, బద్దం లతా జగన్, వారణాసి మల్లవ్వ తిరుమలయ్య, చదువుల తిరుపతమ్మ కోటేష్, బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితోపాటు మాజీ మున్సిపల్ చైర్మన్ దేశాయి,  మాజీ జడ్పిటిసి ఎల్లారెడ్డి, మాజీ జిల్లా గ్రంధాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, పెంబట్ల కోనాపూర్ విండో చైర్మన్ గురునాథ మల్లారెడ్డి,  పలువురు మాజీ బిఆర్ఎస్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు బి ఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని బుగ్గారం జడ్పిటిసి బాదినేని రాజేందర్, ఎంపీపీ రాజమణి, వైస్ ఎంపీపీ జోగినిపల్లి సుచేందర్ లు రెండు రోజుల క్రితం బిఆర్ఎస్ కి రాజీనామా చేశారు. 

గిత్యాలలో ఆరుగురు మున్సిపల్ కౌన్సిలర్లు రాజీనామా

అలాగే శనివారం జగిత్యాల పట్టణానికి చెందిన బి ఆర్ ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు ఆరుగురు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. మున్సిపల్ కౌన్సిలర్లు వల్లేపు రేణుక మోగిలి, సిరికొండ పద్మ సింగారవు, సిరికొండ భారతి, బండారి రజని, దాసరి లావణ్య, అల్లె గంగసాగర్ లు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు కి అందజేయనున్నామని తెలిపారు. ఈ సందర్బంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ పార్టీ విడడం చాలా  బాధగా ఉందని, ఎమ్మెల్యే సంజయ్ కొంతమంది నాయకుల చెప్పుడు మాటలతో పార్టీ కి దూరం పెట్టడం బాధాకరంగా ఉందని అన్నారు.  భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని, అనేక సంవత్సరాలుగా పార్టీ కోసం సేవ చేసామంటూ కన్నీటి పర్యంతమయ్యారు.  పార్టీకోసం నిరంతరం శ్రమించం కానీ ఎమ్మెల్యే మాకు  న్యాయం చేయలేదని, జెండా మోసిన  నాయకులకు న్యాయం చేయాలి లేకుంటే బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇలాగే ఉంటుందని హెచ్చరించారు. రాజీనామా చేసిన కౌన్సిలర్లు ఆదివారం నిజామబాద్ పార్లమెంట్ అభ్యర్థి, ఎమ్మెల్సి జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.