అభివృద్ధి కావాలో విధ్వంసం కావాలో తేల్చుకోండి

అభివృద్ధి కావాలో విధ్వంసం కావాలో తేల్చుకోండి

రూపాయి అభివృద్ధి చేయని బండిని నిలదీయండి 

దేవుడి పేరుతో ఓట్లు అడగడం సిగ్గుచేటు 

6 గ్యారంటీలతో మోసం చేసి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్  

కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి  వినోద్ కుమార్ 

 ముద్ర ప్రతినిధి, కరీంనగర్: బిజెపిని గెలిపించి విధ్వంసం కోరుకుంటారో బిఆర్ఎస్ ని గెలిపించి అభివృద్ధిని కోరుకుంటారో ప్రజల నిర్ణయించుకోవాలని కరీంనగర్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. మాయమాటలు మోసపూరిత  హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరు చెప్పి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.

ఇప్పుడు బీజేపీ దేవుడి పేరు చెప్పి గారడీ మాటలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. పదేళ్ళలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు  వేసి ప్రజలు మోసపోవద్దని వినోద్ కుమార్ అన్నారు. తిమ్మాపూర్ మండలం పోరండ్ల, మన్నెంపల్లి, తిమ్మాపూర్  గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో  బీఆర్ఎస్ నాయకులను కలిసి పార్లమెంట్ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటేస్తే కొట్లాడి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లేస్తే విధ్వంసం చేస్తారని అన్నారు.


పదేళ్ళ పాలనలో బీజేపీ చేసిన అభివృద్ధి చెప్పుకోలేకనే  దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఐదేళ్లలో బుడ్డ పైసా అభివృద్ధి చేయలేదని విమర్శించారు. మతరాజకీయాలు చేస్తూ బండి సంజయ్ రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసిందని  2లక్షల రైతురుణమాఫీ, కళ్యాణలక్ష్మీ లక్షతో పాటు తులం బంగారం, మహిళలకు2500, ఉచిత సిలిండర్, రైతు భరోసా 15000, రైతు కూలీలకు 12000, పెన్షన్ 4000, వంటి హామీలతో మోసం చేశారన్నారు. యాసంగి పంటకు  500ల భోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం నోరుమెదపడం లేదని పేర్కొన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టడం  ఖాయమని అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి కారు గుర్తుపై ఓటు వేసి నన్ను ఎంపీగా గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి.రామకృష్ణ రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల రమేష్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఉల్లెంగుల ఏకానందం, స్వామిరెడ్డి, తిరుపతి రెడ్డి, పొన్నం అనీల్, ఎలుక ఆంజనేయులు, జాప శ్రీనివాస్ రెడ్డి, పుప్పాల కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.