వరుసగా ప్రథమంలో నిర్మల్ జిల్లా - కలెక్టర్ సహా అధికారుల సంబరాలు

వరుసగా ప్రథమంలో నిర్మల్ జిల్లా - కలెక్టర్ సహా అధికారుల సంబరాలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: పదో తరగతి పరీక్షల ఫలితాలలో నిర్మల్ జిల్లా మరో మారు సత్తా చాటింది. 99.O5 శాతం మార్కులతో తెలంగాణ రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. 8908 మంది విద్యార్థులు గాను 8823 ఉత్తీర్ణులై రాష్ట్రంలోనే తమదైన సత్తాను చాటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్  17వ స్థానంలో నిలువగా, మంచిర్యాల జిల్లా 20వ స్థానంలో, ఆసిఫాబాద్ 31 స్థానంలో నిలిచింది. వరుసగా  నిర్మల్ జిల్లా ప్రథమ స్థానం సాధించటంతో జిల్లా అధికారులు, విద్యార్థులు,ఉపాధ్యాయ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

కేక్ కట్ చేసిన కలెక్టర్

పదవ తరగతి పరీక్ష ఫలితాలలో నిర్మల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవడంతో నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్,జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ,ఉపాధ్యాయులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కు జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. స్వీట్లను తినిపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తమ స్థానం పొందేందుకు ప్రణాళికాబద్ధమైన కష్టపడ్డ విద్యాశాఖ సిబ్బందికి, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకొని ఉన్నత స్థాయి శిఖరాలను అధిరోహించేందుకు సామాజిక, సాంకేతికపరమైన రంగాల్లో ముందుకెళ్లాలని సూచించారు. కాలానికి అనుగుణంగా విద్య వైజ్ఞానిక రంగాలలో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ఆధార కోర్సులోనే ఎంచుకొని ఉన్నత స్థాయి చదువులకై సిద్ధం కావాలని సలహా ఇచ్చారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. 

అధికారులు, ఉపాధ్యాయుల సమిష్టి కృషి:డాక్టర్ రవీందర్ రెడ్డి  డిఇఓ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పదవ తరగతి పరీక్ష ఫలితాలలో నిర్మల్ జిల్లా రెండవసారి ప్రథమ స్థానాన్ని సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. సెకండరీ విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో అన్ని కేంద్రాలలో పరీక్షలను పకడ్బందీగా ప్రణాళికబద్ధమైన రీతిలో నిర్వహించినట్లు తెలిపారు. ఒక ప్రణాళిక ప్రకారం పరీక్షలకు సిద్ధం చేయటం వల్ల  కారణంగానే జిల్లాలో పదవ తరగతి పరీక్షలలో ప్రథమ స్థానం సాధించిందని అన్నారు. అన్ని పరీక్ష కేంద్రాలలో పూర్తిస్థాయి మౌలిక వసతుల కల్పనతో పాటు ముందస్తు నియమ నిబంధనలు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. ఇక్కడ కూడా ఇలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఇటు విద్యార్థులకు అటు ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించడం జరిగిందని చెప్పారు. పరీక్షల నిర్వహణకు సహకరించిన సంబంధిత ఉన్నత స్థాయి అధికారులు విద్యాశాఖ సిబ్బంది ఉపాధ్యాయులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.